బాలు గారి పాటలంటే అందరిలాగే నాకు కూడా చాలా ఇష్టం కానీ తను నటించిన ఒక పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అదే కే. బాలచందర్ గారు జెమినీ టీవీ కోసం చేసిన అడుత వీటు కవితై తమిళ సీరియల్ - జీవన సంధ్య (తెలుగు డబ్బింగ్ అయ్యుండొచ్చు). అందులో ప్రముఖ నటి లక్ష్మి గారు, బాలు గారు కలసి చేశారు.

మన మనస్సుకి, మన భావాలకి దగ్గరగా ఉన్న పాత్రలు మన మనస్సుకు తాకుతాయి అంటారు, బహుశా అలాంటి ఒక అద్భుతమైన బాలు గారి పాత్ర నా మనస్సుకి దగ్గరగా ఉందేమో? ప్రత్యేకంగా బాలు గారి నటనతో ఆ పాత్రకి జీవం పోయడం వలన నేను ఆ పాత్రకి కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. ఆ ధారావాహికం రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారం అయ్యేది. దానికోసం నేను ఎక్కడున్నా ఇంటికి వెళ్లి చూసే వాడిని. అలా తన పాటలతో పాటు నటన, ప్రత్యేకించి ఆ పాత్ర నన్ను తనకు అభిమానిగా మార్చింది.

అంతే ఎదో ఒక రోజు తనని కలవాలని, నా భావాలని తనతో చెప్పాలని మనస్సులో చాలా దృడంగా నాటుకుంది. ఆ అవకాశం పాడుతా తీయగా సీజన్ కి కెమరామెన్ గా చేస్తున్న నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా సాకారం అయింది అని చెప్పాలి. బాలుగారిని కలిసి మాట్లాడిన ప్రతిమాట ఇప్పటికి గుర్తుంది. ఆ పాత్ర గురించి జీవన సంధ్య అనగానే తనదైన హాస్య ధోరణితో ఇంకా జీవన సంధ్య రాలేదు అనడం. అందరం నవ్వుకోవడం, ఆ మధురానుభూతి ఎప్పటికి మరచిపోలేను. కలిసింది ఒక్కసారైనా, మాట్లాడింది కొంత సమయం అయినా ఎంతో ఆప్యాత, ఎంతో సానుకూలత నన్ను ఈ పరిశ్రమలో ముందుకు నడవడానికి దోహదపడ్డాయి అనడంలో అతిశయోక్తి లేదు.
తన పాటలు, పాడుతా తీయగా ధారావాహికల్లో పాడిన ప్రతి పాటను - ఎవరు, ఎలా, ఎప్పుడు, స్వరపరిచారో, దాని తాలూకు ప్రతి విషయం, వివరణ, చమత్కారంతో, రసజ్ఞతతో వివరచడం ప్రశంసనీయమైనది.
బాలు గారు తను నటించిన ప్రతి పాత్రతో మనలో, మనతో ఎప్పుడు ఉన్నారు, ఇప్పడు ఉంటారు! అదిగో ఎదో బాలుగారి పాటో, మాటో విన్నట్లు అనిపిస్తుంది కదూ ...!

Comentários